అమరావతి: ఆటో/ క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అర్హులైన వారు నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రీలజ్ చేసిన ప్రత్యేక ఫామ్‌లో వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలి. ఎంపికైన డ్రైవర్ల అకౌంట్లలో అక్టోబర్ 1న ప్రభుత్వం నగదు జమ చేయనుంది. కాగా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 13 నాటికి ఉన్న పాత జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు.
కొత్తవారు ఈ నెల నేటి నుంచి 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 22వ తేదీ వరకు క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత ఈ నెల 24న అర్హుల జాబితా ప్రకటించారు. అక్టోబర్ 1న నగదు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నట్టు సమాచారం. కాగా ఈ పథకం ద్వారా లబ్ధిపొందాలంటే.. సొంత వెహికల్, తప్పనిసరి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. లబ్ధిదారులు తమ వెహికల్‌కు ఏపీ రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, టాక్స్ చెల్లింపు పత్రాలను కలిగి ఉండాలి. 3, 4 చక్రాల సరుకు రవాణా వాహనాలకు పథకం వర్తించదు. లబ్ధిదారుడు తప్పని సరిగా ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలి. కుటుంబంలో ఒక వాహనదారుడికి మాత్రమే పథకం వర్తిస్తుంది.