మ‌ద్యం అమ్మకాల్లో అక్రమాలు.. సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం జరిపిన మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.

By Knakam Karthik
Published on : 6 Feb 2025 7:18 AM IST

Andrapradesh, Sit On Liquor Scam, Tdp, Ysrcp, Janasena

లిక్కర్ అమ్మకాల్లో అక్రమాలు..సిట్ ఏర్పాటు ఏపీ సర్కార్ 

ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం జరిపిన మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం వ్యాపారంలో జరిగిన అక్రమాలపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరుగురు పోలీసు అధికారులను సభ్యులుగా నియమించింది. కాగా దర్యాప్తు బృందం సిట్ డీజీపీ ఆధ్వర్యంలో పని చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. సిట్ దర్యాప్తునకు అన్ని రకాల అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ, దర్యాప్తు రికార్డులను సీజ్ చేసే అధికారాలు కూడా కల్పించింది.

కాగా మద్యం అక్రమాలపై విచారణ చేస్తూ ప్రతి పదిహేను రోజులకోసారి నివేదికను ప్రభుత్వానికి అందివ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్‌లో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేస్తుందని పేర్కొంది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. అయితే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలు ఆఫ్‌లైన్‌లో జరిపింది. దీనిపైనే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన తీవ్రంగా తప్పుపట్టింది. అక్రమ సంపాదన కోసమే ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌ పేమెంట్‌లు జరుపుతున్నారని ఆరోపించింది. ఈ అక్రమాలు నిగ్గు తేల్చేందుకే ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసింది. దీంతోపాటు హోలోగ్రామ్‌ ఏర్పాటు విషయంలో కూడా అక్రమాలు జరిగాయని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తుంది. వీటన్నింటీని ఈ విచారణలో తేల్చేయాలని భావిస్తోంది.

Next Story