ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మారాయ్.. కొత్త పేర్లు ఇవే..

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

By Medi Samrat  Published on  18 Jun 2024 4:00 PM GMT
ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మారాయ్.. కొత్త పేర్లు ఇవే..

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి 'అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి'గా పేరు మార్చారు. ఇక వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి 'చంద్రన్న పెళ్లి కానుక'గా పేరు మార్చారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆదేశాల మేరకు అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ఇకపై 'పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్' గా మార్చారు. వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి 'ఎన్టీఆర్ విద్యోన్నతి' అని పేరు పెట్టారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం పేరును 'సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకం'గా నామకరణం చేశారు.

ఇక వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పందించారు. రాజీనామాలు చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో పని చేయించుకుంటామన్నారు. వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్ల నుంచి మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి తీసుకోమని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. జులై 1వ తేదీనే లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. రూ.4వేల పింఛన్‌తో పాటు మూడు వేలు కలిపి రూ.7 వేలు అందిస్తామన్నారు.

Next Story