ఎట్టకేలకు విశాఖలో లులూ, భూమి కేటాయించాలని సర్కార్ ఆదేశాలు
లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik
ఎట్టకేలకు విశాఖలో లులూ, భూమి కేటాయించాలని సర్కార్ ఆదేశాలు
విశాఖపట్నంలో లులూ మాల్ నిర్మాణానికి ముందడుగు పడింది. లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.ఏపీఐఐసీ ద్వారా ఈ భూకేటాయింపులు జరిగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లులూ గ్రూప్ ప్రతిపాదనలను పరిశీలించి భూకేటాయింపులు జరపాలని ఏపీఐఐసీని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు. బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ నిర్మాణానికి పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూప్ ఆమోదం తెలిపిందని పరిశ్రమల శాఖ వెల్లడించింది.
అయితే 2017లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు లులూ గ్రూప్ ముందుకు వచ్చింది. 2023లో ఈ భూకేటాయింపులను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం మళ్లీ షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణం కోసం లులూ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించి భూ కేటాయింపులు చేయాల్సిందిగా ఏపీఐఐసీని పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు.
లులూ గ్రూప్ భారతదేశంలో తమ రిటైల్ వ్యాపారాన్ని విస్తరిస్తోంది, ఇప్పటికే కేరళ , తెలంగాణ వంటి ప్రాంతాల్లో మాల్‌లను నిర్మించింది. విశాఖపట్నం వంటి నగరంలో మాల్ నిర్మాణానికి ఆసక్తి చూపిస్తోంది. విశాఖపట్నం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావడం, ప్రభుత్వం నుండి పెట్టుబడులకు ప్రోత్సాహకాలు లభించనుండటంతో వేగంగా మాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లులు భావిస్తోంది.