కొత్త రేషన్‌కార్డుల పంపిణీపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన

కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే స్మార్ట్‌ కార్డుల రూపంలో కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది.

By అంజి
Published on : 5 July 2025 1:30 PM IST

AP government, distribution, new ration cards, APnews

కొత్త రేషన్‌కార్డుల పంపిణీపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన

అమరావతి: కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే స్మార్ట్‌ కార్డుల రూపంలో కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం కొత్త రేషన్‌ స్మార్ట్‌ కార్డులను పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్యూఆర్‌ కోడ్‌తో వివరాలు ప్రత్యక్షం అయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్తవి వచ్చే నెలలో పంపిణీ చేయనుంది. నాయకుల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం.. మరోవైపు కార్డుదారు ఫోటో ఉంటుంది. రేషన్ కార్డు నంబరు, రేషన్ షాపు నంబరు వంటి వివరాలు పొందుపరుస్తారు.

కార్డు వెనుకవైపు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్‌ కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది. కాగా ఈ కొత్త కార్డులను.. రేషన్‌ షాపుల్లో ఉండే ఈ-పోస్ యంత్రాల సహాయంతో స్కాన్ చేస్తారు. అప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు, రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ప్రింట్ చేయడం కోసం టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ప్రస్తుతం కార్డుల ముద్రణ జరుగుతోంది. రేషన్ కార్డ్‌కు సంబంధించిన స్టేటస్‌ను చెక్ చేసుకునేందుకు ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ https://vswsonline.ap.gov.in/ ను విజిట్‌ చేయండి.

Next Story