అమరావతి: రాష్ట్రంలోని మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి పథకం) ఈ నెల15 నుంచి అమలు కానుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అధికారికంగా జీవోను జారీ చేసింది. ఈనెల 15 నుంచి TR&B శాఖ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ప్రజా రవాణా శాఖ ద్వారా స్త్రీ శక్తి పథకం అమలు కానుంది.
మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. దీంతో పాటు మహిళా కండక్టర్లు ధరించే దుస్తులకు కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అర్హులైన మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ జారీ చేస్తామని వెల్లడించింది. ఆ ఖర్చును ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
అన్ని బస్‌స్టేషన్లలో సదుపాయాలు మెరుగుపరచాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అటు నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్ రాష్ట్ర సర్వీసులు, కాంట్రాక్ట్ బస్సుల్లో, ఛార్జర్డ్ సర్వీసులు, ప్యాకేజీ టూర్లలో ఈ పథకం అమలు కాదని ప్రభుత్వం తెలిపింది. అలాగే సప్తగిరి ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదని వెల్లడించింది.