అమరావతి: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,745 కోట్లు విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 63,50,765 మందికి ఈ నిధులు అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. కొత్తగా 10,578 మంది స్పౌజ్ లబ్ధిదారులకు (భార్య లేదా భర్త మరణిస్తే జీవించి ఉన్న వారికి ఇచ్చే పింఛను) పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. వీరి పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అదనంగా రూ.4.23 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.45 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు.
పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా ఉండేలా ఇంటి వద్దే పెన్షన్ అందించి జియో కో ఆర్డినేట్స్‌ను నమోదు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పింఛన్ల పంపిణీ కోసం రూ.32,143 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. అక్టోబరు వరకు పింఛన్ల పంపిణీకి రూ. 19,111.85 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.