అమరావతి: సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కంసమామ మోసం చేసి పోతే.. చంద్రన్న న్యాయం చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫీజు బకాయిలు పెట్టి లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. ఆయన పెట్టిన బకాయిలు ప్రజా ప్రభుత్వం తీర్చాలని రోడ్డెక్కిన ఘనత కూడా ఆయనకే దక్కిందని ఎద్దేవా చేశారు.
గత పాలకులు చేసిన పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని తాను విద్యా శాఖా మంత్రి అయిన వెంటనే కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశానని తెలిపారు. దశల వారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం అని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నిన్న రూ.788 కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పండుగ వేళ విద్యార్థులకు తీపి కబురు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.