అమరావతి: రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులు ఈ నెల 30 లోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. రేషన్ కార్డుల్లోని ఐదేళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వారికి కేవైసీ అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. డీలర్/ ఎండీయూ వాహనం వద్ద ఈపోస్ యంత్రంలో వేలిముద్ర వేసి కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేవైసీ ద్వారా అనర్హులను, నకిలీ రేషన్ కార్డులను గుర్తించి తొలగిస్తారు.
ఈ కేవైసీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై అందించే సరుకులు అర్హులైన పేదలకు చేరనున్నాయి. క్యూఆర్ కోడ్ కార్డుతో సభ్యుల వివరాలు సులభంగా తనిఖీ చేయవచ్చు. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తేనే మే 2025 నుంచి విడుదల చేసే కొత్త రేషన్ కార్డులు పొందేందుకు అర్హులవుతారు. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు, ఏటీఎం సైజులో, క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.