అమరావతి క్వాంటర్ వ్యాలీ డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30న విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ చేశారు. తాజాగా దీనిని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. 2035 నాటికి అమరావతిని ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమని తెలిపింది.
దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్‌గా క్వూ చిప్ ఇన్‌ను వచ్చే 12 నెలల్లో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిని క్వాంటమ్ గేట్ వేగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డిక్లరేషన్ రూపొందించారు.
ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పనకై అమరావతిలో ఐఐటీ మద్రాస్, టీసీఎస్, ఐబీఎమ్ సహకారంతో ఈ వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయనున్నారు. క్వాంటం కంప్యూటింగ్, ఏఐ రీసెర్చ్‌ల కోసం కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. స్టార్టప్స్, ఐటీ కంపెనీల ఆవిష్కరణల్లో సహకారానికి ఇంక్యుబేషన్ సెంటర్స్ , ఏఐ నిపుణుల తయారీకి శిక్షణ కేంద్రాలు, హైటెక్ ల్యాబ్స్, డేటా సెంటర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఐటీ కంపెనీల కోసం మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.