వల్లభనేని వంశీకి ఏపీ సర్కార్ షాక్...ఆ అభియోగాలపై విచారణకు సిట్ ఏర్పాటు
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
By Knakam Karthik
వల్లభనేని వంశీకి ఏపీ సర్కార్ షాక్...ఆ అభియోగాలపై విచారణకు సిట్ ఏర్పాటు
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్‌ను నియమించింది. సభ్యులుగా ప్రతాప్ శివ కిషోర్, నరసింహతో పాటు మరో ఇద్దరిని నియామకం చేసింది. ఈ మేరకు వంశీ అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, ఆర్థిక అరాచకలపై దర్యాప్తు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
వంశీ అక్రమ మైనింగ్ సహా వివిధ నేరాల ద్వారా ప్రభుత్వానికి రూ.195 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు సిట్ ఏర్పాటుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో అక్రమంగా గ్రావెల్, మైనింగ్ తవ్వకాలు చేపట్టారని వల్లభనేని వంశీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వంశీ అనుచరులు, స్నేహితులపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. అక్రమార్కులకు వల్లభనేని వంశీ ఆర్థిక సాయం చేశారని ఆరోపణలు సైతం వినిపించాయి. పర్యావరణానికి కూడా హాని కలిగిందని పలువురు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా టీడీపీ ఆఫీసులో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ సబ్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్ ఈ రోజు షాక్ ఇచ్చింది. ఆయనను 3 రోజుల కస్టడీకిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించాలంటూ ఆదేశించింది. విజయవాడ లిమిట్స్ లోనే కస్టడీలోకి తీసుకొని విచారించారంటూ ఆదేశాల్లో పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలంటూ స్పష్టం చేసింది. తాను వెన్నుపూస నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. బెడ్ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.