జగన్‌ పాలనలో ప్రతిరోజూ పండగే

AP Ex Minister Dharmana Krishna Das. గత ప్రభుత్వాలు పండగల సమయంలో ఏవేవో కానుకలు ఇస్తున్నామంటూ హంగామా చేసేవని

By Medi Samrat  Published on  27 Sep 2022 9:14 AM GMT
జగన్‌ పాలనలో ప్రతిరోజూ పండగే

గత ప్రభుత్వాలు పండగల సమయంలో ఏవేవో కానుకలు ఇస్తున్నామంటూ హంగామా చేసేవని, అయితే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత నవరత్నాలతో రాష్ట్ర ప్రజలకు ప్రతిరోజూ పండగలా మారిందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. పోలాకి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం వద్ద మంగళవారం ఆయన 5,558 మందికి వైఎస్సార్‌ చేయూత మూడో విడతలో భాగంగా రూ.10 కోట్ల 85 లక్షల విలువైన‌ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలను ఉన్నత స్థాయిలో చూడాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ లక్ష్యమని అన్నారు. 15 ఏళ్లపాటు సీఎం జగన్‌ రాష్ట్రాన్ని పాలిస్తే ఆర్ధిక అసమానతలు తొలగిపోతాయన్నారు. హామీలను నూరుశాతం అమలు చేస్తోంది సీఎం జగన్‌ మాత్రమేనని వివరించారు. ఆరోగ్యశ్రీలో 3,118 వ్యాధులను చేర్చి పథకాన్ని బలోపేతం చేశారని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్‌ ద్వారా పేద, మధ్య తరగతి పిల్లలను విద్యావంతులుగా మార్చిన ఘనత రాజశేఖరరెడ్డి, జగనన్నలదే అన్నారు. ఇద్దరూ ఇళ్లు, స్థలాలు ఇచ్చి పేదలకు మేలు చేశారని చెప్పారు.

సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్‌ అందిస్తున్నారని వివరించారు. ఒక్క బటన్‌ నొక్కటం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి సొమ్ము జమవుతోందని, లంచాలకు తావులేదని అన్నారు. గత మూడేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని ఆయన వివరించారు. దాచుకోవడం, దోచుకోవడం తప్ప గత పాలకులు చేసింది ఏమి లేదని విమర్శించారు.


Next Story