ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్దన్ రెడ్డి కూడా అమిత్ షాను కలిశారు. ఏపీ బీజేపీకి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించనట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల పాటు సోము వీర్రాజు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డితో పాటు బీజేపీ పెద్దలను సోము వీర్రాజు కలవనున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్‌ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గత నెలలో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు కిరణ్ కుమార్.
కర్ణాటక ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డికి కర్ణాటక ఎన్నికల ప్రచారం బాధ్యతలు అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డిని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు వాళ్లు ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తోంది.