కర్నూలు జిల్లాలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Ex CM Chandrababu. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం కర్నూలు జిల్లాకు చేరుకున్నారు.
By Medi Samrat
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు విమానాశ్రయం చేరిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డిల సమక్షంలో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు చంద్రబాబుకు స్వాగతం పలికాయి. రోడ్డు మార్గం మీదుగా జిల్లా పరిధిలోని కోడుమూరుకు చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత నేత, మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు.
ఇక చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లో విజయ భాస్కర్ రెడ్డి నీతి నిజాయితీ ఉన్నవ్యక్తి.. కానీ, అవినీతికి, అక్రమాలకు ప్రతిరూపం సీఎం జగన్ అని విమర్శించారు. కోడుమూరు నియోజకవర్గంలో మట్టి దోపిడీ, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తున్నారని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్ సహా అన్ని నంద్యాల జిల్లాకు వెళ్లాయని.. కర్నూల్ జిల్లాలో నీటి ఎద్దడి ఉందని అన్నారు. రోడ్ల మీద గుంతలు పడితే మట్టి వేయలేని సీఎం జగన్.. మూడు రాజధానులు కడతాడా? అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సైకిల్ గాలి వీస్తోంది… ఈ గాలిలో వైసీపీ కొట్టుకు పోవడం ఖాయమని అన్నారు చంద్రబాబు. దేశంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు ఉండేది మన రాష్ట్రంలోనే అని.. రైతు ఆత్మహత్యలకు కారణం సీఎం జగనేనని దుయ్యబట్టారు.