ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పీఆర్‌సీ వివాదం కొనసాగుతోంది. పీఆర్‌సీ సమస్యలపై ప్రభుత్వం జారీ చేసిన జీఓలకు నిరసనగా వచ్చే నెల 7 నుండి సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే నిర్ణయించాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులతో కూడిన పీఆర్సీ సాధన కమిటీ సమ్మెపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సీఎస్ సమీర్ శర్మకు నోటీసులిచ్చేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. మరోవైపు ఉద్యోగులతో చర్చల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీతో భేటీకి ఎంప్లాయీస్ యూనియన్ నిరాకరించింది. జీఓలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని స్పష్టం చేశారు.
ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని యూనియన్లు ఏకమవడంతో సతమతమవుతుంటే.. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు వైద్య సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. పిఆర్‌సి సాధన సమితి పిలుపు మేరకు తమ ఉద్యమానికి ఎపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వారు తెలిపారు. చర్చలు ముగిసే వరకు పీఆర్సీ జీఓ రద్దు చేయాలని, పాత జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం.. ఉద్యోగులు తమ డిమాండ్లపై గట్టిగా నిలదీయడంతో సమస్య ఎలా పరిష్కారమవుతుందో వేచి చూడాల్సిందే.