ఆంధ్రప్రదేశ్‌ని పెట్టుబడులకు గేట్ వేగా మార్చుతాం
అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
By Medi Samrat
అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని అన్నారు. అందుకు అనువుగా రాష్ట్రంలో విధానాలకు రూపకల్పన చేశామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ప్రాజెక్టులకు తాను సమన్వయకర్తగా ఉంటానన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతంతో పాటు చమురు, గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్, పర్యాటకం, ఆతిథ్యం ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలోని ప్రైవేట్ హోటల్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025 సదస్సుకు యూఏఈ ఆర్ధిక, పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. వ్యూహాత్మకంగా తూర్పు తీర ప్రాంతంలో ఉన్న ఏపీ ఉత్తర- దక్షిణ భారత్‌లకు వారధిగా ఉందని సీఎం అన్నారు. భారత్‌లో ఏపీని సందర్శించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు వెళ్లి చూడాలని దావోస్‌లో యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రిని ఆహ్వానించానని...ఈ మేరకు ఏపీలోని విజయవాడలో ఇన్వెస్టోపియా సదస్సు నిర్వహించినందుకు అబ్దుల్లాకు ధన్యవాదాలు చెబుతున్నానని సీఎం వ్యాఖ్యానించారు.
యూఏఈ-భారత్ సంబంధాల్లో ఏపీది కీలకపాత్ర
ప్రతికూలతలు, సవాళ్లూ ఉన్నా దుబాయ్‌ని పర్యాటక స్వర్గధామంగా అక్కడి పాలకులు మార్చారని ముఖ్యమంత్రి అన్నారు. దుబాయ్‌లో ఇంటర్నెట్ సిటీ ఏర్పాటు చేస్తే తాను హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించానని అన్నారు. 2021లో ప్రపంచం అంతా కరోనా ప్రభావంతో ఇబ్బందుల్లో ఉంటే యూఏఈ విభిన్నంగా ఆలోచించి ఇన్వెస్టోపియాను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు తలుపులు తెరిచిందని అన్నారు. 1.1 కోట్ల మంది జనాభా ఉన్న యూఏఈలో 38 శాతం మంది భారతీయులు ఉన్నారని వివరించారు. విశ్వసనీయమైన భాగస్వామ్య దేశంగా భారతీయులకు యూఏఈ విస్తృతమైన అవకాశాలు కల్పిస్తోందని, అలాగే భారతీయులు కూడా ఆ దేశానికి సేవలు అందిస్తున్నారని అన్నారు. 2024-25లో 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం భారత్ - యూఏఈల మధ్య జరిగితే అందులో 1.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఏపీ నుంచి జరిగిందని సీఎం తెలిపారు.
భారత్ ఆర్థిక లక్ష్యాలు- ఏపీ ప్రత్యేకతలు:
ప్రస్తుతం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ..2029 నాటికి మూడో స్థానానికి చేరుతుందని అన్నారు. ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కూడా కీలకమైన భాగస్వామి అవుతుందని సీఎం స్పష్టం చేశారు. తూర్పు తీర గేట్ వేగా ఉన్న ఏపీ వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఉందని, అపారమైన వనరులు ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణుల్లో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని అన్నారు. ప్రస్తుతం ఏపీలో నో పావర్టీ మిషన్‌తో పనిచేస్తున్నామని దీని కోసం పీ4 విధానాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు. పీ3 ద్వారా పెట్టుబడులకు మౌలిక వసతులు కల్పించటం లక్ష్యంగా పనిచేస్తే..పీ4 ద్వారా పేదలకు చేయూతను ఇస్తున్నట్టు తెలిపారు.
టెక్నాలజీ-ఆధారిత పాలన, పెట్టుబడులకు ప్రోత్సాహం:
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలోనే దేశానికి క్వాంటం వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. 2026 జనవరి నాటికి ఏపీలో క్వాంటం వ్యాలీ ప్రారంభం అవుతుందని అన్నారు. యూఏఈ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ పాలన అంతా ఆన్‌లైన్‌లో జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 550 పౌర సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉందని అన్నారు. ఆధార్‌తో పాటు ఇళ్లను కూడా జియో ట్యాగింగ్ చేసి ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్టు వివరించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. నీటి వనరులు, వ్యవసాయం, పండ్ల ఉత్పత్తి, డైరీ, ఆక్వా లాంటి రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగం, నైపుణ్యం ఉన్న మానవ వనరుల పరంగానూ ఏపీ బలంగా ఉన్నట్టు సీఎం వివరించారు.
ప్రతిపాదనలతో వచ్చి పెట్టుబడులు పెట్టండి
పెట్టుబడి పెట్టాలని భావించిన మరుక్షణం నుంచే అనుమతులు వచ్చే వరకూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. అనుమతుల అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లను వచ్చి పరీక్షించుకోవచ్చునని ముఖ్యమంత్రి అన్నారు. సమీప భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీ రంగానిదేనని.. 5 గిగావాట్ల ఉత్పత్తి దేశీయ లక్ష్యంలో ఏపీ కూడా ముఖ్య భాగస్వామిగా మారుతుందన్నారు. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఎగుమతులకు విశాఖ, కాకినాడ ప్రాంతాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తయారు చేస్తామని అన్నారు. దీనికి సంబంధించి ఒక ఏడాది యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశామన్నారు. పర్యాటక, ఆతిథ్యం, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, ఏరోస్పేస్, ఆయిల్ గ్యాస్ , పెట్రో కెమికల్స్ రంగాల్లోనూ ఏపీలో ఆకాశమే హద్దుగా అవకాశాలు ఉన్నట్టు సీఎం స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణం, నాలెడ్జి ఎకానమీ రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చన్నారు. త్వరలోనే విశాఖ నగరంలో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోందని సీఎం వెల్లడించారు. త్వరలో అమరావతి నుంచి హజ్ యాత్రకు మక్కా వెళ్లే వారి కోసం ప్రత్యేక విమాన సర్వీసును ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు లులూ లాంటి అంతర్జాతీయ షాపింగ్ మాల్ బ్రాండ్ విశాఖ, విజయవాడలో మాల్స్‌ను ఏర్పాటు చేస్తోందని త్వరలో అమరావతిలోనూ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, యూఏఈ ఆర్ధిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రి సమక్షంలో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, యూఏఈ ఇన్వెస్టోపియా సంస్థలు పెట్టుబడులకు సంబంధించిన అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ సదస్సులో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎస్ కే విజయానంద్, సీఐఐ ప్రెసిడెంట్ ఆర్.ముకుందన్, లూలూ ఇంటర్నేషనల్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం పెట్టుబడులకు సంబంధించి సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రి మధ్య ద్వైపాక్షి చర్చలు జరిగాయి.