ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేరాల రేటు తగ్గింపు, కర్ఫ్యూపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. నెల్లూరు కోర్టులో చోరీ కేసును ఆధారాలతో విచారిస్తున్నామని డీజీపీ తెలిపారు.
కేసులపై ఆరోపణలు రావచ్చు కానీ.. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. ఎవరైనా ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలని సమన్లు జారీ చేశామన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దిశ యాప్‌లో నమోదు చేసుకుంటే మహిళల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి భంగం వాటిల్లదని స్పష్టం చేశారు. ఆలూరి ఘటనలో 82 మందిని అరెస్టు చేశామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. పాడేరు, మన్యం జిల్లాల్లో పోలీసు కార్యాలయాలను 15 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.