ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చు : ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చని ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు.
By Medi Samrat Published on 12 Aug 2023 2:15 PM GMTరాష్ట్రంలో ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చని ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన ఎన్నికలు రేపు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని.. సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేలా ప్రజలకు మంచి పనులు చేస్తున్నామని రాజన్న దొర అన్నారు. ఇక రాజన్న దొర చేసిన వ్యాఖ్యలు ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారానికి ఊపందించాయి. ఇటు ప్రజలకు మంచి జరగాలి.. ఇటు మళ్లీ సీఎం జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలనేది తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పటి నుంచే తాము ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు సిద్దపడుతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో వచ్చే ఏడాది మేలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని ఇప్పటికే చెప్పారని పలువురు వైసీపీ నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రావొచ్చని, సీఎం జగన్ ఆ దిశగా ఆలోచనతో ఉన్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని పలు సందర్బాల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. వైసీపీ అధిష్టనం కూడా ముందస్తుకు వెళ్లేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది.