వారి హయాంలోనే రూ.250 కోట్ల అవినీతి జరిగింది: ఏపీ డిప్యూటీ సీఎం

ఉపాధి హామీ పథకంలో గత వైసీపీ సర్కార్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ఆరోపించారు.

By Knakam Karthik  Published on  17 March 2025 1:46 PM IST
Andrapradesh, Ap Deputy Cm Pawan Kalyan, Assembly Sessions, Ysrcp, Tdp, Janasena

వారి హయాంలోనే రూ.250 కోట్ల అవినీతి జరిగింది: ఏపీ డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకంలో గత వైసీపీ సర్కార్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ఆరోపించారు. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మొత్తం రూ. 250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు ఇచ్చిన రిపోర్టుల ద్వారా వెల్లడి అయిందని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇప్పటివరకు 564 మండలాల్లో ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించిందని తెలిపారు. ఈ పరిశీలనలో అనేక అవకతవకలు బయటపడ్డాయని, ఉపాధి హామీ కింద ఖర్చు చేసిన నిధులపై అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకం ద్వారా వచ్చిన నిధులు లబ్ధిదారులకు చేరకుండా కొందరు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లాయని డిప్యూటీ సీఎం ఆరోపించారు.

ఇప్పటికే మొదలైన ఆడిట్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా మిగిలిన మండలాల్లో కూడా పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉపాధి హామీ పనులను సమీక్షించి, అవినీతికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఉపాధి హామీ కూలీల‌కు వేత‌నాల పెంపు అంశం అనేది కేంద్రం ప‌రిధిలో ఉంటుంద‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు.

Next Story