ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయం, మోడీకి మద్దతుగా నిలుస్తాం: పవన్

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.

By Knakam Karthik
Published on : 7 May 2025 2:09 PM IST

Andrapradesh, AP Deputy CM Pawan Kalyan, Operation Sindoor, PM Modi, Pahalgam Terror Attack, Indian Army

ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయం, మోడీకి మద్దతుగా నిలుస్తాం: పవన్

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. మూడు ఉగ్రవాద సంస్థలకు చెందినవారిని హతమార్చిందని, ఇది దేశమంతా గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించినవారిలో ఆంధ్రవాళ్లు కూడా ఉన్నారని, హిందువా, ముస్లిమా అని అడిగి మరీ చంపారని గుర్తు చేశారు. అప్పటి నుంచి దేశమంతా ఒక డెసెసివ్, బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో, ప్రధాని నరేంద్రమోడీ అందరి ఎదురుచూపులకు సమాధానం చెప్పేలా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయించారన్నారు. పాక్ ఆర్మీ, పౌరులపై దాడి చేయకుండా, వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా భారత ఆర్మీ ఎంతో చాకచక్యంగా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి.. అందరూ గర్వించేలా చేసిందన్నారు.

కశ్మీర్ అనేది దేశంలో భాగం. 1990లో కాశ్మీర్ పండిట్‌లను చంపారు. అంత్యక్రియలను చేయడానికి వచ్చిన వారిని కూడా చంపారు. సరైన సమయంలో ఆర్మీ సరైన నిర్ణయం తీసుకుంది. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లాంటి ఘటనలు చూశాం. మిలిటరీ యుద్ధం చేస్తుంటే మనం ఏం చేయాలో అది తెలియాలి..దాని కోసమే మాక్ డ్రిల్ కార్యక్రమం. దేశ ద్రోహులకు సోషల్ మీడియాలో సరైన సమాధానం చెప్పాలి. పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దు. పార్టీలతో సంబంధం లేకుండా దేశ ప్రజలు ప్రధాని మోడీకి మద్దతుగా ఉండాలి..అని పవన్ పేర్కొన్నారు.

కాగా.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కు అనుకూలంగా ఉన్నవారెవరైనా దేశం వదిలి వెళ్లిపోవాలని పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. దానిపై పవన్ స్పందిస్తూ..నేను కొద్దిరోజుల కిందట కొద్దిమంది కాంగ్రెస్ ​నాయకులకు మాటలను ఉద్దేశించి మాత్రమే కామెంట్స్ చేశా. ఇటువంటి ప్రభుత్వానికి అండగా నిలబడాలి కానీ.. పాకిస్తాన్‌కు ప్రోత్సాహకరంగా మాట్లాడడం తగదు. దేశంపై దాడులను సీరియస్‌గా తీసుకోవాలి..అని పవన్ కోరారు.

Next Story