ఏపీలో ఎన్నికలు సాధ్యం కాదు.. ఎస్ఈసీ కి సీఎస్ లేఖ
AP CS letter to SEC. ఏపీలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న వేళ స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణ
By Medi Samrat Published on 18 Nov 2020 10:14 AM ISTఏపీలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న వేళ స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని, కరోనా నేపథ్యంలో చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించిన విషయాన్ని సీఎస్ ఆ లేఖలో ప్రస్తావించారు.
కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది మరణించారని..మరోసారి కరోనా ప్రబలేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాప్తించే ప్రమాదముందన్నారు. ఇప్పటికే పరిపాలన సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు కరోనా కట్టడికి కృషి చేస్తున్నారన్నారు. ఇప్పుడు కనుక ఎన్నికలు నిర్వహిస్తే వైరస్ గ్రామాలకు కూడా పాకిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రత నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఎంతమాత్రమూ ఆమోద యోగ్యం కాదన్నారు. మరోసారి ఎన్నికల నిర్వహణపై ఆలోచించాలని ఆ లేఖలో కోరారు. అలాగే ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని తాము బావిస్తున్నట్లు చెప్పారు.