వైసీపీ పూలు పెడితే, కూటమి క్యాలీఫ్లవర్లు పెడుతోంది..జాబ్ క్యాలెండర్‌పై షర్మిల సెటైర్

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలోని కూటమి సర్కార్‌పై ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

By -  Knakam Karthik
Published on : 6 Jan 2026 5:30 PM IST

Andrapradesh, Ys Sharmila, Ap Congress, Coalition Government, Tdp, Bjp, Janasena, Job Calender, Unemployment

వైసీపీ పూలు పెడితే, కూటమి క్యాలీఫ్లవర్లు పెడుతోంది..జాబ్ క్యాలెండర్‌పై షర్మిల సెటైర్

అమరావతి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలోని కూటమి సర్కార్‌పై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీని నెరవేర్చకుండా నిరుద్యోగ యువతను ఘోరంగా వంచిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదని, యువతను దగా చేసిన 'దగా క్యాలెండర్', హామీని అపహాస్యం చేసిన 'జోక్ క్యాలెండర్' అని ఆమె అభివర్ణించారు. సంవత్సరాలు మారుతున్నా జాబ్ క్యాలెండర్ కు దిక్కులేదంటూ ట్వీట్ చేశారు.

ఆమె తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. "గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ పేరుతో యువత చెవుల్లో పూలు పెడితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏకంగా క్యాలీఫ్లవర్లు పెడుతోంది" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2025 జనవరి 1న ఇస్తామన్న క్యాలెండర్ ఏమైందని, ఇప్పుడు రెండో ఏడాది కూడా దాని ఊసెత్తకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల ముందు ఉద్యోగాల పేరుతో ఆశ చూపి, భారీగా ఓట్లు దండుకుని, ఇప్పుడు వారి జీవితాలతో చెలగాటమాడటం ప్రభుత్వానికి తగదని హితవు పలికారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం ఉన్న ఆస్తులు అమ్ముకుని మరీ కోచింగ్ సెంటర్లకు వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారని, ప్రభుత్వం నుంచి స్పష్టత లేక వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కలిపి సుమారు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అంచనా ఉందని, అయినా ప్రభుత్వం వాటి భర్తీపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని నిలదీశారు.

'ఇదిగో, అదిగో' అని ఊరించడం మానుకుని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తక్షణమే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని రాష్ట్ర నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైతే, కాంగ్రెస్ పార్టీ యువత పక్షాన నిలబడి పోరాడుతుందని హెచ్చరించారు.

Next Story