Andrapradesh: తెలుగులో జీఎస్టీ 2.0 జీవోలు రిలీజ్

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జీఎస్టీ 2.0 కు సంబంధించి తెలుగులో విడుదల చేసిన అన్ని జీవోల బుక్‌లెట్‌ ను ఆదివారం ఆవిష్కరించారు.

By -  Knakam Karthik
Published on : 21 Sept 2025 7:30 PM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, Commercial Taxes Department, GST 2.0

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జీఎస్టీ 2.0 కు సంబంధించి తెలుగులో విడుదల చేసిన అన్ని జీవోల బుక్‌లెట్‌ ను ఆదివారం ఉండవల్లి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించి, సంబంధిత అధికారులతో రాష్ట్ర పన్నుల విధానంపై సమీక్షించారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో వాణిజ్య పన్నుల శాఖ మొదటిసారిగా జీవోలను తెలుగులో విడుదల చేయడం ప్రారంభించింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఇప్పుడు పన్నులకు సంబంధించిన జీవోలను తమ మాతృభాష తెలుగులో సులభంగా చదువుకోగలుగుతారు. ఏదైనా విషయాన్ని మాతృభాషలో చదివినప్పుడు అది సులభంగా హృదయానికి చేరుతుందని చెప్పడం తెలిసిందే. వాణిజ్య పన్నుల శాఖ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాన్ని ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది వ్యాపారులు, అకౌంటెంట్లు, అధికారులు, ఉద్యోగులు, నిపుణులు అభినందించారని రాష్ట్ర పన్నులు మరియు వాణిజ్య పన్నుల చీఫ్ కమిషనర్ బాబు.ఏ ఒక ప్రకటనలో తెలిపారు.

జీఎస్టీ 2.0 అనేది కేవలం పన్ను సంస్కరణ కాదు.. ఇది ప్రజలే ముందు అనే విధానం. ఇది ఖర్చులను తగ్గిస్తుంది, అనుసరించే విధానాన్ని సులభతరం చేయడంతోపాటు ప్రతి ఇంటిని, రైతులను, విద్యార్థు లను శక్తివంతం చేయడంతోపాటు వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ట్రాక్టర్ల నుండి పాఠ్యపుస్తకాలు, మందుల వరకు ఆదా చేసిన ప్రతి రూపాయి సుస్తిరాభివృద్ధికి దోహదపడుతుంది. ఇది కేవలం పన్ను సంస్కరణ కాదు ఇది ఒక మార్పు..

భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం

సెప్టెంబర్ 21 అర్ధరాత్రపౌరసంబంధాలల్లోకి రానున్న "జీఎస్టీ 2.0 నెక్స్ట్-జెన్ సంస్కరణలు" భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయి. ఈ సంస్కరణల ద్వారా అదనంగా దాదాపు ₹2 లక్షల కోట్ల ప్రయోజనం లభిస్తుందని అంచనా. 'ప్రజలే ముఖ్యం' అనే విధానంతో తీసుకొచ్చిన ఈ కొత్త జీఎస్టీ విధానం ప్రతి ఇంటికీ, రైతులకు, విద్యార్థులకు, వివిధ రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఈ మార్పు వల్ల ₹8,000 కోట్ల ప్రయోజనం లభించనుంది.

వస్తువులపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలకు ధరల భారం తగ్గింది. వెన్న, నెయ్యి, పనీర్, సబ్బులు, షాంపూ, హెయిర్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్, బిస్కెట్లు, కాఫీ వంటి వాటిపై పన్ను తగ్గింది. అలాగే, పాశ్చరైజ్డ్ పాలు, ప్యాకేజ్డ్ పనీర్, బ్రెడ్ వంటి వాటికి జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు లభించింది.

మధ్యతరగతికి భారీ లాభం:

ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, టీవీలు, ఏసీలు, సిమెంట్ వంటి వాటిపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో మధ్యతరగతి వారికి పెద్ద ఊరట లభించింది. అంతేకాకుండా, స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్‌పై పన్ను 5 శాతానికి తగ్గింది.

రైతులకు, కళాకారులకు ప్రయోజనాలు:

వ్యవసాయ రంగానికి ఉపయోగపడే ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఇది రైతులకు భారీ సహాయంగా సహాయపడనుంది. అలాగే, చేనేత, చేతివృత్తుల వారిని ప్రోత్సహించడానికి, వారి ఉత్పత్తులైన ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. దీనివల్ల ఎగుమతులు పెరగడానికి అవకాశం లభిస్తుంది.

పర్యాటకం, ఆర్థిక వ్యవస్థకు బలం:

సేవా రంగం, హోటల్ వసతులపై జీఎస్టీ తగ్గించడం వల్ల హోటల్ ఛార్జీలు తగ్గుతాయి, తద్వారా పర్యాటక రంగానికి ప్రోత్సాహంగా ఉంటుంది.. ధరలు తగ్గడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, MSME (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు) రంగానికి, ఉపాధి కల్పనకు బలం చేకూరుస్తుంది. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి, కొన్ని ప్రాణ రక్షక మందులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తొలగించారు. ఈ సంస్కరణల వల్ల వినియోగదారులకు ₹1 లక్ష కోట్ల వరకు పొదుపు అవుతుందని అంచనా వేయటం జరిగింది.

రాష్ట్రానికి దక్కనున్న ప్రయోజనాలు:

ఆరోగ్యకర, సుసంపన్న, సంతోషకరమైన సమాజాన్ని సాధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు జీఎస్టీ 2 సంస్కరణలు దోహదం చేస్తాయి. ప్రభుత్వం నిర్ధేశించిన 10 మార్గదర్శక సూత్రాలైన పేదరికం లేని సమాజం, జనాభా నిర్వహణ & మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యం & ఉపాధి, నీటి భద్రత, రైతు సంక్షేమం, ప్రపంచస్థాయి లాజిస్టిక్స్ అభివృద్ధి, ఇంధన వినియోగంలో ఖర్చు తగ్గింపు, చేతి వృత్తుల అభివృద్ది, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్ సాంకేతికత వినియోగం వంటి సూత్రాల సాధనకు ఈ సంస్కరణలు తోడ్పడతాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ బాబు ఏ ఆ ప్రకటనలో తెలిపారు.

Next Story