ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాపంగా ఏపీ ప్రభుత్వం రెండురోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం వరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలోనే ఆయన పార్థివ దేహాన్ని అభిమానులు, నేతల సందర్శనార్థం ఉంచుతారు. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని సీఎం జగన్ ఓదార్చారు. సీఎం జగన్‌తో పాటు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళుర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తనకు గౌతమ్‌రెడ్డి అత్యంత సన్నిహితుడన్నారు. 12 ఏళ్ల నుంచి గౌతమ్‌రెడ్డితో పరిచయం ఉందన్నారు. చిన్న వయస్సులో గౌతమ్‌రెడ్డి మరణం చాలా బాధాకరమన్నారు.
గౌతమ్ రెడ్డి కుమారుడు చదువు నిమిత్తం అమెరికాలో ఉంటున్నాడు. అతను వచ్చాకే అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉండటంతో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని నెల్లూరు జిల్లా బ్రాహ్మణ పల్లికి తరలించి, అభిమానుల సందర్శనార్థం రేపంతా అక్కడే ఉంచనున్నారు. ఎల్లుండి బ్రాహ్మణపల్లిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.