సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్.. రేపు ప్రధానితో భేటీ.!
AP CM Jagan will meet PM Modi tomorrow. ఏపీ సీఎం జగన్ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి.. 7 గంటలకు
By అంజి
ఏపీ సీఎం జగన్ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి.. 7 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో భేటీ కానున్నారు. రాత్రి 9:15 గంటలకు ఢిల్లీ చేరుకుని జన్‌పథ్-1లోని నివాసంలో రాత్రి సీఎం జగన్ బస చేయనున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.
పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధనే ప్రధాన లక్ష్యంగా భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పోలవరం నిర్వాసితులకు సీఎం.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కోరనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను అమలు చేయాలని సీఎం జగన్ కోరనున్నారు. కాగా కొన్ని రోజుల కిందటే ఢిల్లీ వెళ్లిన సీఎం.. ఇప్పుడు మళ్లీ ప్రధానితో భేటీ కోసం స్పెషల్‌గా ఢిల్లీ వెళ్లడంపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన జరుగుతుందోని పలువురు అంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ సానుకూలత వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఒకవేళ బీజేపీ.. టీడీపీని దగ్గరికి రానిస్తే.. వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందనే ప్రచారం సాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనలో బీజేపీకి టీడీపీ దగ్గరయ్యే ప్రయత్నాలు జరిగితే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా పడుతుంది. మరోవైపు ఏపీలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు వైసీపీ సిద్ధంగా లేకపోవడం గమనార్హం.