ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం.. ప్రధాని మోదీతో భేటీ..!

AP CM Jagan Visit For Delhi. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మంగళవారం నాడు ఢిల్లీ వెళ్తున్నారు.

By Medi Samrat  Published on  4 April 2022 6:40 AM GMT
ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం.. ప్రధాని మోదీతో భేటీ..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మంగళవారం నాడు ఢిల్లీ వెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు, పునర్విభజన చట్టంలోని వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై చర్చించబోతున్నట్టు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ను ముఖ్యమంత్రి కార్యాలయం కోరింది.

ఈరోజు రాష్ట్రంలో కొత్త జిల్లాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి పేరుతో 13 కొత్తజిల్లాలు ఏర్పాటు అయ్యాయి. కొత్త జిల్లాల అంశాన్ని కూడా ప్రధానితో జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. కొత్త జిల్లాలను నేడు వర్చువల్‌గా ప్రారంభించిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని గ్రామస్థాయి నుంచి చూశాం.. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా వికేంద్రీకరణ చేస్తున్నామన్నారు. నేటి నుంచి మనది 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం అని అన్నారు.

ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం.. మోదీతో భేటీ..!ప్రస్తుతం రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ల సంఖ్య 72కి చేరుకోగా.. అందులో టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం కూడా ఉంది. కుప్పం ఎమ్మెల్యే (చంద్రబాబు) విన్నపం మేరకు రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పటికీ కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేసుకోలేకపోయారని.. ఆ పని తాము చేశామని జగన్ చెప్పారు. పాలన వికేంద్రీకరణ ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు. ప్రజల విన్నపాల మేరకు కొన్ని జిల్లాల్లో మార్పులు చేశామని తెలిపారు. 12 నియోజకవర్గాల్లో మండలాలను వేరు చేసి రెండు జిల్లాల్లో పెట్టాల్సి వచ్చిందని చెప్పారు.

Next Story