రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసింది ఏపీ సర్కార్. ఇన్‌పుట్ సబ్సిడీ, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీరాయితీ సొమ్ముతో పాటు గతంలో వివిధ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు పొందని రైతుల అకౌంట్లలో జమ చేసే సొమ్ముతో కలిపి మొత్తం రూ.199.94 కోట్లను సీఎం వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే నష్టపరిహారం చెల్లిస్తామన్న మాట ప్రకారం.. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. వ్యవసాయ రంగంపై 62 శాతం జనాభా ఆధారపడి ఉన్నారని చెప్పారు. రైతులను అన్నిరకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందని అన్నారు. రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు చెందిన వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్–2022 సీజన్‌లో వివిధ రకాల వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లను సీఎం జగన్ సోమవారం జమ చేసినట్లు తెలిపారు. క్రమం తప్పకుండా రైతులకు పరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు.