ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం – కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకూ పొడిగించాలని.. దీనిపై తగిన పరిశీలనలు పూర్తిచేసి ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని ప్రధానిని కోరారు సీఎం జగన్. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పాడతాయని సీఎం జగన్ ప్రధానిని కోరారు.
పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపొనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని, దీంతోపాటు ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకూ అంగీకరించిందని, ఈరెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదరుచూస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఏపీ సీఎం జగన్. పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తిశాఖ పెండింగ్‌లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరారు సీఎం జగన్. ఇంకా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు.