మూడ్రోజుల యూఏఈ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు.

By -  Knakam Karthik
Published on : 22 Oct 2025 1:33 PM IST

Andrapradesh, Amaravati, CM Chandrababu, UAE visit

మూడ్రోజుల యూఏఈ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు. ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్‌ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి 10 గంటలకు యూఏఈకు బయలుదేరి వెళ్లారు. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. దీంట్లో భాగంగా యూఏఈలో పర్యటించే ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. అలాగే ఓ సైట్ విజిట్ చేస్తారు. ఈ సైట్ విజిట్లో భాగంగా దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది.

ఇవాళ మొత్తంగా ఐదు సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. అలాగే రాత్రి సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు. నవంబరు 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించనున్నారు. అలాగే పర్యటన చివరి రోజున దుబాయ్‌లో AP NRT ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. వీరితో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తారు.

Next Story