రేపు సాయంత్రంలోగా రైతులకు పరిహారం..గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik
రేపు సాయంత్రంలోగా రైతులకు పరిహారం..గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పంటనష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా పిడుగుపాటుకు గురై చనిపోయిన 8 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం కూడా తక్షణమే అందించాలని ఆదేశించారు. గత రెండు రోజుల పాటు రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో వ్యవసాయ, విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట, ప్రాణ నష్టం గురించి అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. జిల్లాల్లో అకాల వర్షాలు, ప్రస్తుత పరిస్థితులను గురించి సీఎంకు కలెక్టర్లు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ....రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తుల సమయాల్లో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. పిడుగుల పడే సమయాల్లో ప్రజల సెల్ ఫోన్‌లకు సందేశం వెళ్లని సమయంలో దగ్గరగా ఉన్నట్లైతే నేరుగా వెళ్లి అప్రమత్తం చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా సచివాలయాల్లోని సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. పిడుగులు పడి చనిపోయిన పశువులకు కూడా నిబంధనల మేరకు పరిహారం వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లాల్లో పరిస్థితులను బట్టి కిందిస్థాయి అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
2,224 హెక్టార్లలో వరిపంట నష్టం
అకాల వర్షాలతో రాష్ట్రంలో 2,224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాల నివేదికను సీఎంకు అందజేశారు. ప్రధానంగా పశ్చిమ గోదావరి, నంద్యాల, కాకినాడ, సత్యసాయి జిల్లాల్లో ఈ పంటలకు నష్టం వాటిల్లిందని అన్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 మండలాల్లో 1,033 హెక్టార్లలో వరిపంట దెబ్బతిందని వివరించారు. నంద్యాల జిల్లాలో 641 హెక్టార్లలో, కాకినాడ జిల్లాలో 530 హెక్టార్లలో, సత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో వరిపంట దెబ్బతిందని అధికారులు వివరించారు.
138 హెక్టార్లలలో ఉద్యాన పంటలకు నష్టం
అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో దెబ్బతిన్న హార్టికల్చర్ పంటల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అరటి, బొప్పాయి, మామిడి, తదితర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ఎక్కువగా అరటి, మామిడి పంటలకు నష్ట వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 138 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉద్యానవన పంటలకు నష్టం కలిగిందని అధికారులు వివరించారు.