గుడ్‌న్యూస్‌.. గ్రామసభల ద్వారా అర్హులకు పింఛన్లు

ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలి.. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు

By Medi Samrat  Published on  21 Sept 2024 7:02 AM IST
గుడ్‌న్యూస్‌.. గ్రామసభల ద్వారా అర్హులకు పింఛన్లు

ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలి.. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకుల దోపిడీ, దౌర్జన్యాలు, దుర్మార్గాలతో గాడితప్పిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు యజ్ఞంలా పని చేస్తున్నామని, నిండు మనసుతో ప్రజలు ఆశీర్వదిస్తే రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసి చూపుతామని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా, మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. గ్రామంలో ప్రజల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ పరిస్థితులు, యోగ క్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

‘‘నేను చాలా మంది సీఎంలను చూశాను కానీ.. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా ప్రజల మధ్యకు వచ్చారా.? మీ సమస్యలు అడిగి తెలుసుకున్నారా?పరిష్కరించారా? ఎక్కడికన్నా వెళ్తే ఆ పరిసరాల్లో చెట్లు నరికించేవారు...ప్రజలు ఎవరూ చూడకుండా పరదాలు కట్టించేవారు. ఇష్టమున్నా, లేకున్నా ప్రజలు ఆయన సభలకు రావాలి. లేదంటే ఇంటికి వచ్చే నీళ్లో, రేషన్ కట్ చేస్తారు. ఆ అరాచకాలన్నీ భరించలేక ప్రజలు వారి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేశారు. పాలనలో మార్పులు తీసుకొచ్చి, ప్రజలకు మరింత సేవ అందించాలని నేను, నా మిత్రుడు పవన్ కళ్యాణ్, నరేంద్రమోదీ నిర్ణయించుకున్నాం. ఈ గ్రామంలోనే ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి కలిసి సమస్యలు తెలుసుకున్నాను. మీ సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికే మీ వద్దకు వస్తున్నా. పఠాన్ ఖాజావలి అనే వ్యక్తి ఇంటికి వెళ్లా...ఆయనకు తల్లి, భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతని తల్లికి రూ.4 వేలు పెన్సన్ వస్తోంది. కానీ ఆర్థిక ఇబ్బందులతో వారి ఇద్దరి బిడ్డలను చదివించలేకపోయారు... వారిని ప్రభుత్వమే చదివిస్తుంది. ఖాజావలి కుటుంబానికి 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు మంజూరైంది...2 బిల్లులు కూడా మంజూరు చేశాం. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.65,150 బిల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు...ఆ డబ్బులను మీ అందరి సమక్షంలో వారి కుటుంబానికి ఇస్తున్నాం. దేశంలోనే మొదటిసారిగా ఎన్టీఆర్ పింఛన్ల విధానాన్ని రూ.35 లతో ప్రారంభించారు. తర్వాత దాన్ని నేను రూ.70 లకు పెంచాను. 2014లో అధికారంలోకి రాగానే మళ్లీ రూ.2 వేలకు పెంచాను. ఇప్పుడు రూ.4 వేలకు పెంచాను. యేడాదికి సుమారు రూ.35 వేల కోట్లు పింఛన్లకు ఖర్చు అవుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలల పింఛన్లు కూడా కలిపి జూలైలో రూ.7 వేలు అందించాం. 1వ తేదీన సెలవు రోజు వస్తే ఉద్యోగులు, లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఒకరోజు ముందే పింఛన్లు ఇచ్చాం. పేదల సేవలో భాగంగా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్లి కష్టాలు తెలుసుకునేలా పింఛన్ల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పెన్షన్లను గత ప్రభుత్వం అస్తవ్యస్థంగా తయారు చేశారు. దొంగ సదరం సర్టిఫికేట్లు తెచ్చుకుని వికలాంగుల కోటాలో పింఛన్లు తీసుకున్నారు. అర్హులందరికీ పింఛను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ తప్పుడు సర్టిఫికేట్లతో లబ్ధిపొందాలని చూస్తే చర్యలుంటాయి.. డాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉద్యోగాలకు ఎసరు వస్తుంది. ఈ ప్రభుత్వం పేదల కోసమే ఉంది. గత ఐదేళ్లు ఊరికో సైకో తయారయ్యాడు. ఎదురుదాడి చేస్తే భయపడటం కాదు...తాటతీస్తా.

ఇల్లులేని ప్రతి కుటుంబానికి సొంతిల్లు నిర్మాణం

‘ఈ గ్రామంలో 200 కుటుంబాలకు ఇళ్లులేవు... వారందరికీ స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తాం. గౌడలకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. తద్వారా బలహీన వర్గాలు కూడా ఆర్థికంగా బలపడతాయి. మేము అనుకుంటే 2 లక్షల మందితో సభలు పెట్టొచ్చు...కానీ గ్రామ స్థాయిలో అయితే నేరుగా మిమ్మల్ని కలవొచ్చు. నేను వచ్చింది మిమ్మలన్ని చూడటానికి...ఎటువంటి ఆర్భాటాలు, హంగులు లేకుండా వచ్చా. ఆర్భాటాలు చేస్తే ఏమీ రాదు. నేను చేసే పనులతో మీ జీవితాల్లో మార్పులు రావాలనేదే ఆలోచన. గాడి తప్పిన పాలన గాడిన పెడుతున్నాం. ప్రజలు నమ్మి 93 శాతం సీట్లు ఇచ్చి గెలిపించారు. ప్రజలు గెలవాలి...రాష్ట్రాన్ని నిలబెట్టాలి...మీ భవిష్యత్తు బాగుండాలని ఓట్లు వేశారు. గత పాలకుల విధానాలతో అప్పటికే రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది. మీరు 21 మంది ఎంపీలను ఇవ్వడంతో ఢిల్లీలో మన రాష్ట్ర పరపతి పెరిగింది. కేంద్రం కూడా సహకరిస్తోంది. మీరు చూపిన చొరవే రాష్ట్రాన్ని నిలబెడుతోంది.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

ప్రభుత్వ ఆస్తులు, పరువును కాపాడుతున్నాం

‘విచ్చలవిడితనంతో రూ.10లక్షల కోట్ల అప్పులు చేశారు. ప్రభుత్వానికి కూడా పరువు, ఆస్తులు ఉంటాయి. వాటిని పోగొట్టుకోకూడదు...అందుకే ప్రభుత్వ ఆస్తులు, పరపతిని కాపాడుకుంటూ వస్తున్నాం. 7 ప్రధాన అంశాలపై శ్వేత పత్రం విడుదల చేసి వాస్తవాలు మీ కళ్లముందు ఉంచాం. శాఖలపై సమీక్షలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. కేంద్రం నుండి వచ్చిన నిధులు దారి మళ్లించారు. పంచాయతీలకు రూ.990 కోట్లు ఇవ్వలేదు...వాటిని మేమొచ్చి ఇవ్వడంతో కేంద్రం నుండి రూ.12 వందల కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ వచ్చింది. అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు. కేంద్రం జల్ జీవన్ మిషన్ పథకం తీసుకొచ్చింది. ఆ పథకాన్ని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. చాలా రాష్ట్రాలు రాష్ట్రవాటా నిధులు ఖర్చు పెట్టి ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ మన రాష్ట్రంలో ఇచ్చిన నిధులు కూడా ఖర్చు చేయకుండా దారి మళ్లించారు. అందుకే మళ్లీ సమీక్షలు చేసి రూ.500 కోట్లు రాష్ట్రం వాటా విడుదల చేసి పనులు ప్రారంభించాలని నిర్ణయించాం. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు...విధ్వంసం చేశారు. శ్రమించి రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం. ఎవరో ఒకరు వచ్చి మేము అది చేస్తా...ఇది చేస్తా అంటే నమ్మి ఓట్లు వేస్తున్నారు. దీంతో కుదుటపడుతున్న రాష్ట్రాన్ని మళ్లీ కిందకు లాగుతున్నారు. స్థిర ప్రభుత్వం ఉంటే అభివృద్ధిని వేగంగా చేసుకోవచ్చు.’ అని సీఎం వివరించారు.

అందుబాటులో ఉంటే ఉచితంగా ఇసుక తెచ్చుకోండి

‘మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం...కూటమి ప్రభుత్వం రాకుండా ఉంటే మీ భూమి మీకు దక్కకుండా పోయేది. రాజముద్రతో మళ్లీ మీకు పాసుపుస్తకాలు అందిస్తాం. గత పాలకులు ఏం చేసినా చెల్లుతుంది అని వ్యవహరించారు. 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం... దుర్మార్గులు వాటిని కూడా గతంలో మూసేశారు. ఇక్కడే గుండ్లకమ్మ ఉంది...మీకు అవసరమైతే మీ ట్రాక్టర్ తీసుకెళ్లండి, ఎడ్లబండిని తీసుకెళ్లైనా ఇసుక తెచ్చుకోండి. మీకు అందుబాటులో ఉన్న చోటనుండి స్వేచ్ఛగా ఇసుక తీసుకెళ్లండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడి నుండి ఇసుక తీసుకెళ్లండి. కానీ అతిగా తవ్వకుండా భూగర్భ జలాలకు ఇబ్బంది లేకుండా తవ్వకాలు చేయాలని సూచిస్తున్నా. ఇసుక దొరకని ప్రాంతాల వారు 24 గంటల పాటు బుక్ చేసుకునే సదుపాయం కల్పించాం. నాసిరకం మద్యంతో గత ఐదేళ్లు విచ్చలవిడిగా దోచేశారు. రూ.90 ఉండాల్సిన క్వార్టర్ ధరను రూ.149లకు అమ్మి దోచుకున్నారు. కేంద్రం కూడా మంచి కార్యక్రమాలు చేస్తోంది...వాటిని కూడా వినియోగించుకుందాం. పోలవరానికి రూ.12,500 కోట్లు, అమరావతికి రూ.15 వేల కోట్లు, 3 పారిశ్రామిక కారిడార్లకు రూ.5 వేల కోట్లు కేంద్రం ఇచ్చింది. 70 ఏళ్ల పైబడిన వారికి రూ.6 లక్షల దాకా ఆరోగ్య బీమా ఇచ్చింది.’ అని సీఎం వివరించారు.

ప్రజలు బుద్ధి చెప్పడంతో ఇంట్లో కూర్చుని 3 నెలల్లోనే ఏమీ చేయలేదని మాటలు

ప్రజలు బుద్ధి చెప్పడంతో ఓడిపోయి ఇంట్లో కూర్చుని 3 నెలల్లోనే అది చేయలేదు...ఇది చేయలేదు అని మాట్లాడుతున్నారు. వారు 6 నెలలదాకా ఒక్కపనైనా చేశారా.? ప్రతి మతస్తుడికి ఆ మతంపై విశ్వాసం ఉంటుంది. తిరుమల పవిత్రను గత పాలకులు దెబ్బతీశారు. లడ్డులో కల్తీ నెయ్యి వాడారు. రూ.320లకే నెయ్యి వస్తుందని కల్తీ నెయ్యితో దేవుడుకి నైవేద్యం పెట్టారు. ఇప్పుడు మేం తప్పు చేయలేదు.... టెండర్లు పిలిచామని బుకాయిస్తున్నారు. కనీసం రూ.500 లకు వచ్చే నెయ్యి రూ.320 లకే ఇస్తున్నారంటే ఆలోచించాలి కదా.? ఈ విధంగా ప్రవర్తిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినవా? వైసీపీ ప్రభుత్వంలో ప్రసాదం, దర్శనాలు, అన్నప్రసాదం ఏమీ బాగోలేవు. నేను సీఎం అవ్వగానే టీటీడీలో కొత్త ఈఓను నియమించి ప్రక్షాళన చేపట్టాం. లడ్డులో నాణ్యత పెంచాం. కల్తీ నెయ్యి తెచ్చి తిరుమల పవిత్రను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టాలా.? నంగనాచిగా మాట్లాడే ప్రజలు నమ్ముతారా.? ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి టీటీడీ ఛైర్మన్ గా చేశాడు...అతని పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు...చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు.’ అని మండిపడ్డారు.

బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని దెబ్బతీయాలని చూశారు...

‘‘మూడు బోట్లను కృష్ణానదిలో వదిలి ప్రకాశం బ్యారేజీని దెబ్బతీయాలని చూశారు. ఆ పడవలు వేగంగా వచ్చి కౌంటర్ వెయిట్ ను ఢీ కొట్టాయి. అదే గేట్లను ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదం ఏర్పడేది. సొంత బాబాయినే చంపి గుండె పోటు అని ప్రచారం చేశారు...తర్వాత నారాసుర రక్త చరిత్ర అని నాపై రాశారు. నేరాలు చేసి ఎదుటి వారిపై నెట్టడం అలవాటుగా మారింది. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు. ముంబయి నటిని సంబంధం లేని కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టారు...చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే మళ్లీ విమర్శలు చేస్తున్నారు. తప్పు చేసిన ఎవర్నీ వదలను. 24 గంటలూ నాకు ప్రజలే గుర్తుంటారు. ఏ2 మాట్లాడుతున్నాడు....నాకు అడ్మినిస్ట్రేషన్ గురించి l తెలీదంట. నా అటెన్షన్ ఎవరూ డైవర్షన్ చేయలేరు. ప్రతి ఇంటికీ విద్యుత్, నీటి కనెక్షన్ ఇస్తాం. దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తాం.’ అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Next Story