మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు.. ఏపిలో జరుగుతున్న ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన టీడీపీ అధినేత చంద్రబాబుకి ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రాజధాని అమరావతి భూముల అక్రమాలపై నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన అధికారులు ఆయనకు నోటీసులు అందజేసినట్లు సమాచారం.

అమరావతిలో భూముల కొనుగోలు అమ్మకాల పై చంద్రబాబు పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ సీఐడి 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. రాజధాని ప్రకటనకు ముందుగానే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, వారి బంధువులు అమరావతి ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తోంది. ఈ క్రమంలో సీఐడీ విచారణకు ఆదేశించింది.

ఈ నెల 23న విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులో ఉన్నట్లు సమాచారం. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజులకు ఈ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ముందు నుంచి అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబు అండ్ కో అవినీతికి పాల్పడిందని అధికార వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది.

చంద్రబాబుతో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశముంది. చంద్రబాబుపై మూడు రోజుల క్రితమే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సెక్షన్లు 120బి, 166, 167, 217 కింద చంద్రబాబుపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.


సామ్రాట్

Next Story