ఆ కేసును నాకు ముడిపెట్టారు, హత్యారాజకీయాలు లేకుండా 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నా: చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ హయాంలో కర్రలు, ఆయుధాలతో దాడి చేశారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 11 March 2025 3:37 PM IST
ఆ కేసును నాకు ముడిపెట్టారు, హత్యారాజకీయాలు లేకుండా 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నా: చంద్రబాబు
ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయాలపై ఎప్పుడూ దాడి జరగలేదు.. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కర్రలు, ఆయుధాలతో దాడి చేశారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శాంతి భద్రతలు ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. గంజాయి, డ్రగ్స్‌పై కూటమి ప్రభుత్వం నిరంతరం యుద్ధం చేస్తుంది. గంజాయి పండించ వద్దని గిరిజన ప్రాంతాల్లో వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం దీనిపై ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. అందుకే పరిస్థితులు విచ్చలవిడిగా మారిపోయాయి..అని సీఎం చంద్రబాబు అన్నారు.
మహిళలపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేస్తే..వారికి అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉంటే కచ్చితంగా శాంతి భద్రతలు అదుపులో ఉండాల్సిందే. ముఠాలు, కుమ్ములాటలూ, రౌడీలను అణచివేస్తాం. శాంతి భద్రతల విషయంలో డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ చేయిస్తున్నాం. నిందితులకు రెండు మూడు నెలల్లోను శిక్షపడేలా చేశాం. సైబర్ సెక్యూరిటీ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 26 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నాం..అని సీఎం పేర్కొన్నారు.
టెక్నాలజీ కంటే పోలీస్ డాగ్స్ ఎక్కువ ఆధారాలని కనిపెట్టగలుగుతున్నాయి. వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు అనుమానాస్పదంగా చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం 6 మంది సాక్షులు చనిపోయారు. దీనిపై లోతుగా విచారణ జరగాల్సిందే. వివేకా గుండెపోటుతో చనిపోయారని ముందు సమాచారం ఇచ్చారు. నేరస్థులు ఎలా మభ్యపెడతారు అనేదానికి ఈ కేసు ఓ ఉదాహరణ. గుండెపోటు అని చెప్పిన టీవీలోనే, గొడ్డలిపోటు అని వార్త ఇచ్చారు. ఆ హత్య కేసుకు నాకు ముడిపెట్టి దుష్ప్రచారం చేశారు. హత్యారాజకీయాలు లేకుండా 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నా..అని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ ముసుగులో నేరాలు చేసి తప్పుకుంటామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. శాంతిభద్రతలు విస్మరిస్తే ప్రజల్లో అశాంతి వస్తుందని ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నాం. సాంకేతికతను వినియోగించుకుని శాంతిభద్రతలను అదుపులో ఉంచుతాం. ఉదాసీనంగా ఉంటే కొందరు పేట్రేగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వబోం. కొందరు భావోద్వేగాల ట్రాప్‌లో పడుతున్నారు. ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపుతున్నారు రాజకీయ ముసుగులో హత్యలు, నేరాలు చేస్తే ఊరుకోను..అని సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.