రాజీనామాకు సిద్ధపడిన మేకతోటి సుచరిత.. తీవ్ర అసంతృప్తిలో ఆశావహులు
AP Cabinet Updates. సీఎం జగన్ కొత్త క్యాబినెట్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మాజీ హోంమంత్రి మేకతోటి
By Medi Samrat
సీఎం జగన్ కొత్త క్యాబినెట్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తనను క్యాబినెట్ లో కొనసాగించనందుకు మనస్తాపం చెందారనే వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమైనట్టు వెల్లడైంది. మేకతోట సుచరిత కుమార్తె రిషిక స్పందిస్తూ, మంత్రి పదవిలో ఎందుకు కొనసాగించలేదో పార్టీ నుంచి తగిన వివరణ లేదని అన్నారు. రాజీనామా లేఖను వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు ఇచ్చామని చెప్పారు. మోపిదేవి స్పందిస్తూ, వైసీపీ అంతా ఒకటే కుటుంబమని, అసంతృప్తులు ఉన్నా త్వరలోనే సమసిపోతాయని పేర్కొన్నారు. మంత్రి పదవి ఒక్కటే ముఖ్యం కాదని హితవు పలికారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురిని మంత్రివర్గంలో కొనసాగిస్తూ, తనను మాత్రం తప్పించడంపై మేకతోటి సుచరిత తీవ్ర వేదనకు గురైనట్టు సమాచారం.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏపీ నూతన క్యాబినెట్ జాబితాలో చోటు దక్కలేదని కన్నీరు పెట్టుకున్నారు. తనకు మంత్రి పదవి దక్కలేదని, వైసీపీ నేతలు, కార్పొరేటర్లు ఎవరూ రాజీనామాలు చేయొద్దని సూచించారు. వైసీపీ కార్యకర్తలు, నేతలు తమ రక్తాన్నే చెమటగా మార్చి తనను రెండుసార్లు గెలిపించారని, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నానని కోటంరెడ్డి వివరించారు. మంత్రి పదవి రాలేదన్న బాధ ఉందంటూ భావోద్వేగాలు వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను మద్దతుదారులు జాతీయ రహదారిపై టైర్లు దగ్ధం చేశారు. ఓ ద్విచక్రవాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. నాలుగు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కొత్త క్యాబినెట్ జాబితాలో తన పేరు లేదని తెలుసుకున్న పిన్నెల్లి తన నివాసానికే పరిమితమయ్యారు. ఎవరినీ కలవడానికి ఆయన ఆసక్తి చూపలేదు.