ఏపీ కొత్త క్యాబినెట్ కూర్పుపై కసరత్తులు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రాత్రి 7 గంటలకు కొత్త మంత్రివర్గ జాబితాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపిస్తామని తెలిపారు. నూతన మంత్రివర్గ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్లో ఉంచి రాజ్ భవన్ కు పంపుతామని, గవర్నర్ ఆమోదం తర్వాత సీఎం జగన్ ఫోన్ ద్వారా కొత్త మంత్రులకు సమాచారం అందిస్తారని సజ్జల వివరించారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదించారు. ఈ ఖాళీలకు సంబంధించి కాసేపట్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 11న ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో 24 మంది మంత్రులు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త కేబినెట్ లో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే విషయమై సీఎం జగన్, సజ్జల పలుమార్లు సమావేశమయ్యారు. ఇవాళ కూడా సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సజ్జల, కోర్ కమిటీతో భేటీ నిర్వహించి కొత్త క్యాబినెట్ కూర్పుపై కసరత్తులు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తయింది. రాత్రి 7 గంటలకు రాజ్‌భవన్‌కు మంత్రుల జాబితాను పంపుతాం' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.