ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు ఈ నెల 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేసి బహుమతిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరో వైపు జిల్లాల పునర్విభజన లోపాలు, సరిహద్దు సమస్యలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
జనగణన ప్రారంభమయ్యేలోపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళ పరిస్థితికి త్వరితగతిన తెరదించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కాగా దీనిపై ఇటీవలే మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు అయినందున పని వేగవంతం చేయాలని కోరారు.
అటు ఏపీఐఐసీకి రూ.7500 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, భూసేకరణ కోసం ఏపీఐఐసీ నిధులు ఉపయోగించుకోనుంది. ఇక బార్ పాలసీ 2025-2028 కి ఆమోదం కేబినెట్ ఆమోదం తెలపగా, బార్ పాలసీకి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.