నేడే ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్‌

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.

By అంజి  Published on  20 Nov 2024 6:23 AM IST
AP Cabinet, APnews, Amaravathi, Polvaram, Free Bus, CM Chandrababu

నేడే ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్‌

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. నేటి సాయంత్రం 4.00 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్‌ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ క్యాబినెట్‌లో ఆమోదం తెలుపనున్నారు.

ఆయా పనులకు సంబంధించి కొత్త టెండర్లు పిలిచే విషయంపై నేడు జరగబోయే కేబినెట్‌లో చర్చించి.. అనంతరం వాటికి ఆమోదం తెలపనున్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీపావళి వేళ.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సైతం ప్రారంభించింది.

రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల విలువైన 10 భారీ పరిశ్రమలకు అనుమతులు, భూములు కేటాయించాలని ఎస్‌ఐపీబీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్టేట్‌ ఇండస్ట్రీయల్‌ ప్రమోషన్‌ బోర్డుతో సీఎం చంద్రబాబు సమావేశమై నిర్ణయం తీసుకున్నారని, రీస్టార్ట్‌ ఏపీలో ఇది తొలి అడుగు అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కంపెనీలతో 34 వేల ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు స్పష్టం చేసింది.

Next Story