అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. పలు కీలక అజెండా అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. రూ.169 కోట్లతో లోక్‌భవన్ బంగ్లా నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అటు జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి రూ.163 కోట్లకు పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలపనుంది. 20234-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి రూ.7380.70 కోట్లు రుణం తీసుకునేందుకు CRDAకి కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధించే పనులకు రూ. 532కోట్ల మేర ఆమోదం తెలపనుంది. SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుండగా.. రూ. 20వేల కోట్లు పెట్టుబడులు, 56 వేల ఉద్యోగాలు కల్పనకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు అనుమతి ఇవ్వనుంది. కాగా మంత్రివర్గం సమావేశం అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.