ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు.
By - Medi Samrat |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రహదారుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం, విద్యా రంగం, జైళ్ల సంస్కరణలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారి 16పై భారీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తాడేపల్లి వరకు 3.8 కిలోమీటర్ల పొడవున ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ఎల్1 బిడ్‌ను ఆమోదించారు. ఈ ప్రాజెక్టులో ఇంటర్‌ఛేంజ్‌లు, వంతెనలు, అండర్‌పాస్‌లు కూడా భాగంగా ఉంటాయి. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు విలువ రూ.532 కోట్ల 57 లక్షలుగా నిర్ణయించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని పలార్ నదిపై ఉన్న చెక్‌డ్యామ్ మరమ్మతులు, పునర్నిర్మాణ పనుల కోసం సవరించిన పరిపాలనా ఆమోదాన్ని కేబినెట్ మంజూరు చేసింది. గతంలో రూ.10.24 కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.15.96 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ రెండు విడతల కరవు భత్యం (డీఏ) మంజూరుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 3.64 శాతం చొప్పున డీఏ చెల్లించనున్నారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని 417 పోస్టులను అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో 227 తెలుగు, 91 హిందీ భాషా పండితుల పోస్టులతో పాటు 99 వ్యాయామ ఉపాధ్యాయుల (పీడీ) పోస్టులను స్కూల్ అసిస్టెంట్ల కేడర్‌కు ఉన్నతీకరించారు. బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను రద్దు చేస్తూ జైళ్ల సంస్కరణల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.