42 కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
AP Cabinet approves 42 key issues. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీ ముగిసింది.
By Medi Samrat Published on 24 Jun 2022 3:00 PM GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ భేటీలో కేబినెట్ అజెండాలోని దాదాపు 42 కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేస్తూ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ నెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఆర్సీ జీవోలో చేసిన మార్పులకు మంత్రివర్గ ఓకే చెప్పింది.
జగనన్న ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి పాలసీ,సంక్షేమ క్యాలెండర్‌కు పచ్చజెండా ఊపారు. ఆక్వాసాగు సబ్సిడీ 10 ఎకరాలు ఉన్న వారికి సైతం వర్తించనుంది. పాత జిల్లాల జడ్పీ ఛైర్మన్ కొనసాగింపునకు ఆమోదం తెలిపారు. ఈనెల 27న అమ్మ ఒడి పథకం నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన చట్ట సవరణకు ఓకే చెప్పారు. వచ్చే నెలలో అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు విద్యా కానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహనమిత్ర పథకాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంశధార నిర్వాసితులకు రూ.216 కోట్ల పరిహారం అందించనున్నారు. దీనిపై మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో రూ.15 వేల కోట్లతో ఏర్పాటుకానున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు ఆమోదముద్ర వేశారు. వైద్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 3 వేల 530 ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు. దేవాలయాల కౌలు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.