ఇలాంటి మహిళ పీసీసీ అధ్యక్షురాలా..? : విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేశారు.

By Medi Samrat  Published on  3 Feb 2024 5:30 PM IST
ఇలాంటి మహిళ పీసీసీ అధ్యక్షురాలా..? : విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేశారు. ధర్నా సందర్భంగా ఆమె తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పటివరకు మోదీ గారు అంటూ వ్యాఖ్యలు చేసిన షర్మిల... రూ.46 లక్షల కోట్ల బడ్జెట్ ప్రకటించినా, అందులో ఏపీకి ఏం చేశారు 'మోడీ గాడు' అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వెంటనే తప్పు గ్రహించి 'మోడీ గారు' అని పేర్కొన్నారు.

షర్మిల వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశ ప్రధానమంత్రి గారి పట్ల వాడు, వీడు అని అసభ్య పదజాలం వాడడం షర్మిల రాజకీయ దివాలాకోరుతనం అంటూ విమర్శించారు. ఇలాంటి ఒక మహిళను పీసీసీ అధ్యక్షురాలిగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిగ్గుపడాలని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు.

"దేశ ప్రధానమంత్రి గారిని వాడు, వీడు అని అసభ్య పదజాలం వాడుతున్న షర్మిల @realyssharmila రాజకీయ దివాలతనానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలు సిగ్గుపడాలి ఇలాంటి ఒక మహిళను పిసిసి అధ్యక్షురాలుగా అని చెప్పుకోవడానికి . @INC_Andhra" అంటూ ట్వీట్ చేశారు విష్ణు వర్ధన్ రెడ్డి. ఈ మేరకు తన ట్వీట్ లో షర్మిల వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ ను కూడా పంచుకున్నారు.


Next Story