విచక్షణ మరిచి మాట్లాడతారా జగన్? పోలీసులకు క్షమాపణ చెప్పండి: పురందేశ్వరి
జగన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik
విచక్షణ మరిచి మాట్లాడతారా జగన్? పోలీసులకు క్షమాపణ చెప్పండి: పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల బట్టలూడిస్తానంటూ జగన్ మాట్లాడారని టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అటు జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ పోలీసు అధికారుల సంఘం కూడా ప్రకటించింది. వెంటనే జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ మేరకు పురందేశ్వరి మాట్లాడుతూ.. పోలీసులు రాజకీయ నాయకుల యొక్క చొరవతోనో, వేరే ఏదో ఒక వ్యవస్థ చొరవతో యూనిఫామ్‌ను సంపాదించుకోరు. కష్టతరమైన పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై ఆ యూనిఫామ్‌ను సంపాదించుకుంటారు. నాలుగో సింహంగా పరిగణించే పోలీసులను బట్టలూడదీసి కొడతానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆమె అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మహిళ అనే విచక్షణ కూడా లేకుండా జగన్ మాట్లాడారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థలో దాదాపు 5 వేల మంది మహిళలు ఉన్నారనే విషయాన్ని జగన్ గుర్తించాలని చెప్పారు. పోలీసులందరినీ కించపరిచేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. పోలీసు వ్యవస్థకి జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.