జనవరి 24న ఏపీ బంద్
అంగన్వాడీలకు మద్దతుగా ఏపీ బంద్‌కు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి.
By Medi Samrat Published on 22 Jan 2024 7:30 PM ISTఅంగన్వాడీలకు మద్దతుగా ఏపీ బంద్‌కు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. 24వ తేదీన అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలని.. అంగన్వాడీలకు సంఘీభావంగా రాష్ట్ర బంద్ చేయడం అవసరమని రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు తెలిపాయి. ఈ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్ పిలుపును ఇచ్చారు.
సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి ఎస్మా చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ విధుల్లో చేరకపోవడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. నోటీసుల గడువు పూర్తికావడంతో ఇప్పటికీ విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలంటూ కలెక్టర్లకు సూచించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించేందుకు కలెక్టర్లు చర్యలు చేపడుతున్నారు. అంగన్వాడీలకు టర్మినేషన్ లెటర్లు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తీసేసిన అంగన్వాడీల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.