రేప‌టి నుంచి ప్రారంభ‌కానున్న ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

AP Assembly Sessions Starts From Tomorrow. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేప‌టి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం

By Medi Samrat  Published on  29 Nov 2020 6:09 PM IST
రేప‌టి నుంచి ప్రారంభ‌కానున్న ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేప‌టి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. శాసనసభ సమావేశాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 1,637 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ బందోబస్తులో పాలుపంచుకుంటున్నారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ.. నలుగురు ఏఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 58 మంది సీఐలు, 9 మంది ఆర్ఐలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించినట్టు వెల్లడించారు. గరుడ కంట్రోల్ సెంటర్ నుంచి బందోబస్తు బాధ్యతల పర్యవేక్షణ నిర్వహిస్తామని చెప్పారు. ఐటీ కోర్ టీమ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ పరిసరాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంటుందని తెలిపారు.

స్పీక‌ర్‌కు చంద్ర‌బాబు లేఖ‌

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. శాసనసభ శీతాకాల సమావేశాలకు మీడియాను అనుమతించకుండా, అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ ను తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని తాము ఖండిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. మీడియా అనేది ప్రజాస్వామ్యంలో ప్రధాన భాగస్వామి అని, అలాంటి మీడియాను నిషేధించడం అప్రజాస్వామ్య చర్య అని విమర్శించారు. ఇటీవల పార్లమెంటు సమావేశాలకు మీడియాను అనుమతించారని, అక్కడలేని నిషేధం ఇక్కడెందుకని ప్రశ్నించారు.


Next Story