సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజూ 4 ఆటలు ఉండాల్సింది.. 10 నుంచి 12 షోలు వేస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఏమి చేసినా ఎవరూ పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఉన్నారు. బలహీనతలు సొమ్ము చేసుకునే వ్యవస్థను కట్టడి చేసే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆన్‌లైన్ లో టిక్కెట్లు అమ్మితేనే దోపిడీ అరికట్టగలమని తెలిపారు. షోలు కూడా ప్రభుత్వం నిర్దారించిన సమయంలోనే ప్రదర్శించాలని.. పరిశ్రమ ప్రభుత్వ నిబంధనలకు లోబడే నడుచుకోవాలని స్పష్టం చేశారు.
ఇష్టానుసారంగా నడుచుకునే అవకాశం ఉండకూడదని.. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు సినిమా చూసేలా మధ్యతరగతి వారి కోసం కొత్త విధానం తెచ్చామని తెలిపారు. టాక్స్ లు కూడా పొంతన కుదరడం లేదని.. ఎవరూ టాక్స్ లు దాచేలా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించకుండా ఆన్‌లైన్ విధానం తెస్తున్నామని తెలిపారు. తక్కువ రేటుకు వినోదం.. ప్రభుత్వానికి టాక్స్ ల రూపంలో ఆదాయం సరిగా వస్తుందని అన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్ ప్రభుత్వంపై నిందలు వేస్తే అర్థం ఉంటుంది.. కానీ ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వంపై బురద వేయడం దురదృష్టమని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం అప్పుల కోసం ఈ విధానం తీసుకొస్తుందని ఆరోపణలు చేయడం దురదృష్టకరం అని అన్నారు. బస్సు, రైలు టిక్కెట్లు ఆన్‌లైన్ తీసుకోవడానికి లేని అభ్యంతరం సినిమా టిక్కెట్లపై ఎందుకు? అని ప్రశ్నించారు. అత్యంత సౌలభ్యకరంగా సినిమాను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. డబ్బులు పోగు చేసుకోవాలని.. అప్పులు తేవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. సామాన్యుడు క్యూలైన్ లో నిలబడే అవసరం లేకుండా టిక్కెట్లు తీసుకోవచ్చని తెలిపారు.