ఆంధ్రప్రదేశ్ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. సభలోకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, సభ్యులు హాజరయ్యారు. అసెంబ్లీలో 'నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది' అనే ప్లకార్డులను కూటమి సభ్యులు ప్రదర్శించారు. తొలుత జాతీయ గీతాలాపన జరిగిన తర్వాత.. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైంది. తొలుత ఎమ్మెల్యేగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.
శాసనసభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని పాటిస్తానని, సభా మర్యాదలను గౌరవిస్తానని ఆయన ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేష్, బి.సి.జనార్ధన్ రెడ్డి, ఎన్.ఎం.డి ఫరూక్, కందుల దుర్గేష్, టీజీ భరత్ ప్రమాణం చేశారు. మిగతా సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
సభ్యులందరి ప్రమాణం పూర్తయ్యాక స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. స్పీకర్ పదవికి నర్సీపట్నం ఎమ్మెల్యే, బీసీ సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేయనున్నారు. నూతన స్పీకర్ సభాపతి స్థానంలో కుర్చున్న తరువాత స్పీకర్‌ను ఉద్దేశించి తొలుత సభా నాయకుడైన చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడతారు. వాటికి స్పీకర్ సమాధానం ఇచ్చాక సభ నిరవధిక వాయిదా పడనుంది.