గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ఏపి అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. జనవరి 26 గురువారం ఉదయం ఎంతో ఘనంగా జరుగనున్న 74 వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆంద్రప్రదేశ్ సచివాలయం, శాసన సభ, శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి. ఆంద్రప్రదేశ్ శాసన సభా భవనంతో పాటు రాష్ట్ర సచివాలయంలోని ఐదు బ్లాక్ లను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగింది.
ఇదిలావుంటే.. గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగనున్నాయి. రేపు ఉదయం 8.50 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొంటారు సీఎం జగన్. శాసన మండలి అధ్యక్షుడు కె.మోషేన్ రాజు మండలి భవనంపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాష్ట్ర అసెంబ్లీ భవనంపై రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద గురువారం ఉదయం 7.30 గం.లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారు.