5 లక్షలు దాటిన కోవిడ్ టెలి'కన్సల్టేషన్'
AP 104 Teleconsultation. 104 కాల్ సెంటర్లో గత ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో ప్రారంభమైన కోవిడ్ టెలికన్సల్టేషన్ సేవలు బుధవారం
By Medi Samrat Published on 9 Jun 2021 10:03 PM IST104 కాల్ సెంటర్లో గత ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో ప్రారంభమైన కోవిడ్ టెలికన్సల్టేషన్ సేవలు బుధవారం సాయంత్రానికి 5 లక్షలు దాటాయని ఎపి కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటి వరకూ మొత్తం 5,53,306 మంది పేషెంట్లు ఈ టెలికన్సల్టేషన్ సేవల ద్వారా తమ ఆరోగ్య సమస్యలకు వైద్యుల సూచనలు, సలహాలు అందుకున్నారని వివరించింది. ఇందులో ఐదు వేల మందికి పైగా వైద్యలు , వైద్య నిపుణులు కోవిడ్ పేషెంట్లకు టెలికన్సల్టేషన్ సేవలందిస్తున్నారని తెలిపింది. రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితి తీవ్రతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 104 కోవిడ్ కాల్ సెంటర్లను పునర్వ్యవస్థీకరించిందని ప్రకటనలో పేర్కొంది.
ఏప్రిల్ 16న గన్నవరంలోని హెచ్సీఎల్ కాంపస్, మే 13న మంగళగిరిలోని ఎపిఐఐసి భవనంలో ఈ కేంద్రాలను పునర్వ్యవస్థీకరించినట్లు తెలిపింది. ఈ కేంద్రాలలో మూడు షిఫ్ట్ ల్లో 240 (100+100+40) సిబ్బంది, సేవలంందిస్తున్నారని వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,482 టెలి కన్సల్టేషన్ కాల్స్ అందాయని, ఇందులో కొవిడ్ టెస్ట్ రిపోర్టుల కోసం 304, వాక్సిస్ కోసం 147, కోవిడ్ సమాచారం కోసం 1,299 కాల్స్, ఆస్పత్రుల్లో అడ్మిషన్ కోసం 332 కాల్స్ వున్నాయని వివరించింది.
951 మంది స్పెషలిస్టులతో పాటు 5012 మంది వైద్యులు టెలి కన్సల్టేషన్ సేవలందించేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపింది. పేషెంట్లకు నేరుగా అందించే ఈ టెలి కన్సల్టేషన్ సేవలను 104 టెలి కన్సల్టేషన్ విభాగానికి అనుసంధానించారని ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ లక్షణాలున్న పేషెంట్లు ఆస్పత్రుల్లో అడ్మిట్ కాకుండా, ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ సేవలందుకోవచ్చని సూచించింది.