సూర్యనారాయణకు ముందస్తు బెయిల్
ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణకు అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat
ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణకు అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలతో ఏపీజీఈఏ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించగా ఆయన అభ్యర్థనను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంలో సవాలు చేశారు.
సెప్టెంబర్ 15న సూర్యనారాయణకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. విచారణకు సహకరించాలని సూర్యనారాయణను ఆదేశించింది. జనవరి 12న విచారణకు వచ్చిన సందర్భంలో తాము 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. సూర్యనారాయణను ఎన్నిసార్లు విచారణకు వచ్చారు.. కేసులో ఏం జరుగుతుందో వివరాలన్నీ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నుంచి ధర్మాసనం వివరాలు అడిగింది. సూర్యనారాయణకు ముందస్తు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. సూర్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సూర్యనారాయణను ఒకసారి విచారణకు పిలిచారని, అది కూడా జనవరి 14న నోటీసులు ఇచ్చి 15న విచారణకు పిలిచినట్లు ధర్మాసనానికి తెలిపారు. వాదోపవాదనలు విన్న తర్వాత ధర్మాసనం సెప్టెంబర్ 15న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సవరిస్తూ ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.