ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్తగా మరో డిపార్ట్‌మెంట్ ఏర్పాటు కానుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (శాస్త్ర, సాంకేతిక శాఖ)ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను అదేశించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న అటవీ పర్యావరణ శాఖలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక సబ్జెక్టుగానే ఉంది. కానీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టెమెంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా రాష్ట్రాన్ని రూపుదిద్దే క్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనితో పాటు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనల ప్రోత్సాహం, నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా పని చేసేలా నూతన శాఖ ఉండాలని సీఎం భావిస్తున్నారు. ఇప్పటికే ఐదు శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారికే శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే నూతన శాఖ పని చేయనుంది.